నా గురించి

Wednesday, March 24, 2010

శ్రీ రామా !


రామా ! గుణాభిరామా !
రామా ! కోదండ రామ ! రఘుకుల సోమా !
రామా ! శ్రీ రఘు రామా !
రామా ! సీతా సమేత రాఘవ నామా !

Sunday, February 28, 2010

ప్రెషర్ కుక్కర్


నీళ్ళు సలసలా కాగి
మరిగి ఆవిరైపోయి
కుక్కర్ ఇనుప గోడల్ని
అతలాకుతలం చేస్తూ
చివరికి -
ఒక చిన్న రంధ్రం ద్వారా
బయటికి చిమ్ముకొస్తున్న దృశ్యం

ఒక పీడనంలో నుండి వెలువడ్డ
ఒక ఉచ్చస్థాయి కేక.

పీడనం ఎక్కువైపోతే
ఏదో ఒక రోజు
ప్రెషర్ కుక్కర్ బాంబులా
బద్ధలవడం తప్పదు

Monday, February 15, 2010

సెల్‌ఫోన్ యువత




సెల్లులోనె కళ్ళు చేతిలొ చార్జరు
వాడు యెపుడు మాటలాడు చుండు !
బిల్లు పెరుగుతున్న - బింకమ్ము చూపక
సెల్లులోనె వాడు త్రుళ్ళు చుండు !

Sunday, February 14, 2010

భక్త సేవకుడు


ఒకప్పుడు ఒక క్షురకుడు ఉండేవాడు. అతడు ప్రతిదినం రాజమందిరానికి వెళ్ళి, రాజుగారికి ముఖక్షవరం చేసేవాడు. క్షురకుడు మహా శివభక్తుడు. ఉదయాన్నే దైవపూజ చేయకుండా ఏ పనీ మొదలుపెట్టే వాడు కాదు.
ఒకరోజు ఆ మంగలి దైవాన్ని ధ్యానిస్తూ కాలాన్ని పూర్తిగా మరచిపోయాడు. సమయానికి మంగలి రాకపోవడం చూసి, రాజు కోపించి భటులను పిలిచి, త్వరగా ఆ మంగలిని తీసుకురండని ఆజ్ఞాపించాడు. ఇంటికి వచ్చిన భటులను చూసి మంగలి భార్య భయపడి, త్వరగా పూజ గదిలోకి వెళ్ళింది వార్తను చెప్పడానికి. కాని అతడు పూర్తిగా ధ్యానమగ్నుడై ఉండడం చూసి అతని ధ్యానాన్ని భగ్నం చేయడం యిష్టం లేక, తిరిగి వెలుపలికి వచ్చి భటులతో "ఆయన యింట్లో లేరు! వచ్చీరాగానే రాజమందిరానికి పంపిస్తాను " అని చెప్పింది.
అప్పటికే మంగలిపై అసూయాద్వేష మనస్కులైన రాజభటులు రాజుకు జరిగింది విన్నవించి, మంగలి భార్య అబద్దమాడుతోందని చెప్ఫారు.
అది విని రాజు కోపంగా భటులతో "వెంటనే వాడిని తాళ్ళతో కట్టిపడేసి, యిక్కడకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు.భటులు ఆనందంతో నృత్యం చేస్తూ మంగలి యింటి వైపు బయలుదేరారు.
అప్పుడు పరమేశ్వరుడు భక్త సంరక్షణార్థం, తాను మంగలి వేషం ధరించి, రాజమందిరానికి వెళ్ళాడు. అతనిని చూడడంతోనే రాజుకు కోపం ఉపశమించి, ఏమీ అనలేక పోయాడు. మంగలి రూపంలో నున్న భగవానుడు రాజుకు ముఖక్షవరం చేసి, కొంత సుగంధ తైలాన్ని తెప్పించి రాజుగారికి శరీరమర్దనం చేశాడు. అతని హస్తకౌశలం చూసి రాజు ముగ్ధుడైపోయాడు. తైలపాత్రలో మంగలి నాలుగు చేతులతో కనిపించగా, రాజు విస్మిత సమ్మోహితుడై, అతనికి ఎన్నో బంగారు నాణాలను బహూకరించి పంపివేశాడు. వాటిని స్వీకరించి పరమేశ్వరుడు వెలుపలికి వచ్చి అదృశ్యమైనాడు.
ఇంతలో ధ్యానాన్ని చాలించిన మంగలి, తన యింటి వైపు వస్తున్న భటులను గమనించి జరిగిన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే రాజప్రాసాదానికి వెళ్ళి తన ఆలస్యాన్ని మన్నించమని రాజును వేడుకున్నాడు.
దాని కారాజు "ఏమయ్యా! ఇప్పుడే గదా నాకు గెడ్డం గీసి వెళ్ళావు. తిరిగి వచ్చి ఎందుకు నన్ను క్షమాపణను వేడుతున్నావు?" అని ప్రశ్నించాడు. " ఏదీ ! నీ చతుర్భుజ రూపం మళ్ళీ ఒకమారు ప్రదర్శించు! చూడాలని వుంది " అని కూడ అన్నాడు.
అది విని మంగలి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే తన రూపంలో వచ్చి రాజుకు ముఖక్షవరం చేశాడని గ్రహించి, " హే! భగవాన్! నన్ను రాజదండనం నుండి తప్పించడానికే నీవు నా రూపంలో వచ్చి, రాజుకు ముఖక్షవరం, శరీరమర్దనం చేశావు గదా! కాని రాజుకు నీ దర్శనభాగ్యం కలిగించి నాకెందుకు ఆ భాగ్యాన్ని కలిగించలేదు " అని చింతించాడు.
అప్పుడు దయామయుడు ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై, మంగలి ముందు ప్రత్యక్షమై అతనికి తన దర్శనభాగ్యం కలిగించాడు.

మూలం : సంస్కృత కథానిక " భక్త సేవక: "

Thursday, January 28, 2010

నిశ్శబ్దం


గంట నుంచీ నాతో
మాట్లాడుతున్నావు ఫోన్లో ఏదో !
ఒక్క క్షణం నిశ్శబ్దం -
అప్పుడర్థమైంది ...
నువ్వు చెప్పదలచు కున్నదేమిటో !

Tuesday, January 12, 2010

పండిట్ కుమార గంధర్వ


'''పండిట్ కుమార గంధర్వ''' (శివపుత్ర సిద్ధరామయ్య కోంకళి) ఏప్రిల్ 8, 1924 న కర్ణాటక రాష్టంలోని బెల్గాం జిల్లాలోని సులేభావి గ్రామంలో జన్మించాడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు కుమార గంధర్వ . "కుమార గంధర్వ" అనే బిరుదు ఆయనకు చిన్నతనంలోనే బహూకరించబడింది. హిందూ పురాణాల్లో గంధర్వుడు సంగీతానికి ఆద్యుడైన దివ్యపురుషుడు.

==జీవిత విశేషాలు==
ఆయన చిన్నతనంలో కుమార గంధర్వకు సంగీతంలో ప్రొఫెసర్ బి.ఆర్. డియోధర్ నుండి శిక్షణ లభించింది. 1947 లో భానుమతి కాన్స్‌ను వివాహమాడి, మధ్యప్రదేశ్ లోని "దివాస్" కు మకాం మార్చాడు. అక్కడే ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ సోకగా, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మళ్ళీ "ఋణానుబంధాచ్య" వంటి మరాఠీ గీతాలు పాడినా, ఊపిరి అందక, మునుపటిలాగా పాడలేకపోయాడు. కుమార గంధర్వ నిర్గుణి భజనలు జానపద గీతాలు, రాగాలు ఒక విశిష్ట శైలిలో పాడేవాడు. కొందరు ఆయన పాడే విలంబిత్ గాయన పద్ధతిని విమర్శించినా, ద్రుపద్ గాయనాన్ని మెచ్చుకొనేవారు. 1961 లో భానుమతి మరణం తరువాత, కుమార గంధర్వ తన సహ విద్యార్థిని, ''వసుంధరా శ్రీఖండే"ను వివాహం చేసుకొన్నాడు. ఆమె కుమార గంధర్వ తో కలిసి భజనలు పాడేది. వారి కుమార్తె కలాపిని కోంకళి వారికి తాన్‌పురా వాయించేది. ఆయన శిష్యులలో ముఖ్యులు సత్యశీల్ దేశ్ పాండే మరియు శుభా ముద్గల్ లు. కుమార గంధర్వకు 1990 లో పద్మవిభూషణ్ అవార్డ్ లభించింది.


( ఈ రోజు అంటే జనవరి 12, పండిత్ కుమార్ గంధర్వ వర్ధంతిని పురస్కరించుకొని )

పండిత్ కుమార్ గంధర్వ పాడిన రాగాలు , గీతాలు

Wednesday, January 6, 2010

సవాయి గంధర్వ సంగీత మహోత్సవం


'''సవాయి గంధర్వ సంగీత మహోత్సవం''' : భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో, చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు. "ఆర్య సంగీత ప్రసారక మండలి " ప్రారంభించిన ఈ ఉత్సవాలను పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రతి యేటా,
పుణె నగరంలో నిర్వహిస్తాడు. ఈ ఉత్సవం సవాయి గంధర్వ జీవితం, సంగీతపరంగా ఆయన సాధించిన విజయాల జ్ఞాపకార్థంగా నిర్వహించబడుతుంది.
డిశంబరు, 2002 లో ఈ ఉత్సవం స్వర్ణోత్సవాలను జరుపుకొంది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఈ ఉత్సవం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగివుంది. గత యాభై ఏళ్ళుగా, పుణె నగర సంగీతాభిమానులు, విఖ్యాత హిందుస్తానీ సంగీత కళాకారుల మరపురాని కచేరీలను ఈ ఉత్సవాలో విని ఆనందిస్తున్నారు.

==చరిత్ర==
సవాయి గంధర్వ సంగీత మహోత్సవం, హిందుస్తానీ సంగీత చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నది. భారత స్వాతంత్ర్యానికి పూర్వం, హిందుస్తానీ సంగీతం రాజుల "ఆస్థాన సంగీత విద్వాంసుల సాంప్రదాయం" మూలంగా బ్రతికింది. స్వాతంత్ర్యానంతరం, హిందుస్తానీ సంగీతం భారత్, పాకిస్తాన్ లతో పాటే చీలిపోయి, అటు పాకిస్తాన్, ఇటు భారత దేశం ఎందరో ప్రజ్ఞావంతులయిన సంగీత కళాకారుల్ని కోల్పోయాయి. కొత్త రాజకీయ పరిస్థితుల కనుగుణంగా, ఎలా తమ సంగీతం నిలదొక్కుకుంటుందో అని విచారించి, ఎందరో సంగీత కళాకారులు తమ కళను బ్రతికించుకోవడానికి ఎన్నో సంగీత కచేరీల నిస్తుండేవారు.
ఈ సవాయి గంధర్వ సంగీత మహోత్సవం కళాకారుల నందరినీ సంఘటితంగా, ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలను నిత్యనూతనంగా ప్రవేశపెడుతోంది.

ఈ సంగీతోత్సవాల్లో ఇంతవరకు పాల్గొన్నవర్ధమాన మరియు మేటి కళాకారులు : హీరాబాయి బరోడేకర్, డా. వసంతరావు దేశ్‌పాండె, బేగం అక్తర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాకిర్ హుసేన్ (సంగీతకారుడు), సరస్వతి రాణె, ఉస్తాద్ అహ్మద్‌జాన్ తిరఖ్‌వా, కుమార గంధర్వ, కిశోరి అమోంకర్, పండిట్ భీమ్ సేన్ జోషి లు. ఇంకా, అరుణా సాయిరాం, (కర్ణాటక సంగీతం), గణేశ్ కుమరేశ్ లు (వయొలిన్), పండిట్ జస్‌రాజ్, పండిట్ అజయ్ చక్తవర్తి, మాలిని రాజూర్కర్, పండిట్ రాజన్ సాజన్ మిశ్రా లు (గాత్రం), శ్రీనివాస్ జోషి, పండిట్ శివకుమార్ శర్మ (సంతూర్), రోను మజుందార్ (ఫ్లూట్), అనుజ్, స్మృతి మిశ్రా లు (కథక్).

==సాంప్రదాయం==
ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం డిశంబర్, మొదటి రెండు వారాల్లో, మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. ప్రతి కళాకారుడీకీ, సవాయి గంధర్వ సంగీత మహోత్సవంలో పాల్గొనడం అంటే, ఒక గొప్ప సన్మానంతో కూడుకొన్న అవకాశం. ఈ వేదికపై ఎందరో వర్ధమాన కళాకారులు పరిచయం చేయబడ్డారు. చివరి రోజు ఆఖరున, పండిట్ భీంసేన్ జోషి గాత్రకచేరీ ఉండడం, ఈ ఉత్సవ సాంప్రదాయం. కచేరీ తరువాత అబ్దుల్ కరీంఖాన్ ప్రాశస్త్యానికి తీసుకు వచ్చిన, "భైరవి ఠుమ్రి" రాగం - ''జమునా కే తీర్'' - పండిట్ సవాయి గంధర్వ పాడిన రికార్డును వేయగా, వేలాది శ్రోతలు విని ఆనందిస్తారు.


( రేపటి నుండి, అంటే జనవరి 7 నుండి జనవరి 10, 2010 వరకు పుణె నగరంలో సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఈ వ్యాసం పున:ప్రచురణ )

సవాయి గంధర్వ సంగీత మహోత్స వం వెబ్ సైట్
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago