నా గురించి

Friday, August 31, 2012

వివేకము

                                            

పూర్వం కళింగ రాజ్యానికి రాజు సత్యగుప్తుడు. అతని కుమారుడు కమలాపీడుడు. అతడు ఎన్నో విద్యల నభ్యసించిన బుద్ధిశాలి. కాని కొంచెం అహంకారి కూడ. అతడు ఎల్లప్పుడు మహారాజునే పరిహసించేవాడు. 
రాజు వివేకి. తన కుమారుని అవివేకాన్ని గ్రహించి మనసులో బాధపడుతూ వుండే వాడు. 

రాజు వద్ద గొప్ప సైన్యం వుండేది. ఒకమారు యువరాజు సైన్యం విషయంలో  తండ్రితో ఇలా అన్నాడు " నాయనా! ఈ సైన్యం వల్ల ఏమి ప్రయోజనం? వీరిని పోషించడానికి అయ్యే ఖర్చువ్యర్థం." 
రాజు యిలా అన్నాడు" కుమారా! యుద్ద సమయంలో సైన్యం అత్యావశ్యకం. అందువల్ల సైనికులను ఎల్లప్పుడూ పోషిస్తూ వుండాల్సిందే! అప్పుడు వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి రాజ్యాన్ని రక్షిస్తారు. "
దానికి యువరాజు గర్వంగా" యుద్దం ఆసన్నమైనప్పుడు ధనం యిస్తే  ఎంతో మంది సైనికులు లభిస్తారు గదా! అన్నం కొరకు కాకులు ఎలా గుంపులు గుంపులుగా వచ్చి చేరతాయో అలా ధనం కోసం ప్రజలు వచ్చి చేరుతారు. " అని అన్నాడు.  మహారాజు మౌనంగా వుండి పోయాడు. 

రాజు ఆరోజు రాత్రి యువరాజును ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ అన్నాన్ని నేలపై వుంచి, తన కుమారునితో " కుమారా! ఏదీ యిప్పుడు కాకులను పిలువ్!" అని అన్నాడు 
"రాత్రిపూట కాకులెలా వస్తాయి? మీరేమైనా మూర్ఖులా ?" అని యువరాజు ప్రశ్నించాడు. 
" కుమారా! నేను మూర్ఖుడిని కాను. నీ అవివేకాన్ని తొలగించడానికే నేనిలా చేశాను. ఎలా ఇప్పుడు అన్నం కోసం కాకులు రావో , అలాగే యుద్దం వచ్చినప్పుడు ధనం యిచ్చినా కూడ సైనికులు ఎవరూ రారు. కనుక దేశాన్ని రక్షించుకోవడం కోసం ఎల్లవేళలా సైనికులను కాపాడుకోవాలి. " అని మహారాజు యువరాజు కుపదేశించి, అతని అవివేకాన్ని తొలగించాడు.  


సుగంధ: ( సంసృత కథాసంగ్రహ: ) నుండి 




Sunday, August 12, 2012

మనమున తాళంగలేక ...

సమస్య :

"మనమున తాళంగలేక మామను గోరెన్ ! "

నా పూరణ :

అనఘుడు భీముని వలచిన
దనుజుని కొమరిత హిడింబి ; దండక వన సీ
మ నిదాఘ ఘర్మపీడిత ;
మనమున తాళంగలేక మామను గోరెన్ !

భావము :

భీముని వరించిన హిడింబి, దండకారణ్యంలో చెమటలు పట్టే ఎండ వేడిమికి తాళలేక, మనసులో తన మామగారైన అంటే వాయుదేవుణ్ణి ( చల్ల గాలిని ) కోరుకున్నదని అర్థం.



అసలు దీనికి మూలం - ఒక అవధానంలో సంస్కృతంలో ఇవ్వబడిన ఒక సమస్య:

" స్తనవస్త్రం పరిత్యజ్య వధూ శ్వశుర మిఛ్చతి "

గణపతి శాస్త్రి అనుకుంటా - దీనిని ఇలా పూరించారని చదివాను.

హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిత్యజ్య వధూ శ్వశుర మిఛ్చతి

( హిడింబాయా శ్వశుర : వాయు ఇతి ప్రసిద్ద మస్తి )
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago