నా గురించి

Saturday, September 29, 2012

ప్రాణం కంటే సంస్కృతి గొప్పది



పూర్వం హర్ష చక్రవర్తి భారత దేశాన్ని పరిపాలించే కాలంలో "హువాన్ సంగ్ "అనే చైనా దేశస్థుడు భారత దేశాన్ని దర్శించేందుకు వచ్చాడు. అతడు భారత దేశంలో వున్న అనేక ప్రదేశాలు తిరిగాడు. అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నాడు. భారతీయ సంస్కృతిని అధ్యయనం చేశాడు.  అతడు ఎన్నో గ్రంధాలను ఐతిహాసిక వస్తువులను సేకరించాడు.  

హువాన్ సంగ్ స్వదేశానికి తిరిగి వెళుతూ, హర్ష చక్రవర్తిని దర్శించి తన అనుభవాలను నివేదించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. హర్షుడు  అతని రక్షణార్థం ఇరవై మంది సైనికులను అతని వెంట పంపాడు. 

హర్షుడు ప్రయాణారంభ సమయంలో సైనికుల నుద్దేశించి, " సైనికులారా! యితని నౌకలో వివిధ భారతీయ ధర్మశాస్త్ర గ్రంధాలు మరియు అనేక ఐతిహాసిక వస్తువులు వున్నాయి. అవి భారతీయ సంస్కృతికి ప్రతీకలు. చాలా అమూల్యమైనవి. అందువల యితనిని మరియు యీ గ్రంధాలను వస్తువులను పరిరక్షించడం మీ కర్తవ్యం. " అని అన్నాడు.   

ప్రయాణం ప్రారంభమైంది. చాలా రోజుల వరకూ ప్రయాణంలో ఎటువంటి అవాంతరం  కలుగలేదు. అకస్మాత్తుగా ఒకరోజు సముద్రంలో తుఫాను సంభవించింది. దాని మూలంగా నౌక సముద్రంలో ఊగిసలాడసాగింది. " నావ నీళ్ళలో మునిగిపోతుందో ఏమో ? " అన్న శంక ఉత్పన్న మైంది. ఓడ సరంగు భయకంపితుడై యిలా అరిచాడు " నౌక బరువు అధికమైంది.  తొందరగా యీ   నావలోని గ్రంధాలను వస్తువులను సముద్రంలోకి విసిరివేసి మీ ప్రాణాలను రక్షించుకోండి " 
 
అప్పుడు సేనాపతి సైనికుల నుద్దేశించి యిలా అన్నాడు " యోధులారా ! ఇది మనకు అగ్ని పరీక్ష. ధర్మశాస్త్ర గ్రంధాలను వస్తువులను , వాటి ద్వారా భారతీయ సంస్కృతిని రక్షించడం మన కర్తవ్యం. అందుకు అందరూ సిద్దంగా వుండండి. ప్రాణాలను అర్పించైనా మనం మన కర్తవ్యాన్ని పాలించాలి. "

నాయకుడి మాటలు విన్న మరుక్షణమే సైనికు లందరూ ఒక్కసారిగా సముద్రంలోకి దుమికారు. భారతీయ సంస్కృతిని రక్షించడం కోసం తమ  ప్రాణాలను గడ్డిపోచల వలె త్యాగం చేశారు.   

అత్యాశ్చర్యకరమైన యీ దృశ్యాన్ని చూసిన హువాన్ సంగ్ కనులలో అశ్రువులు వుబికాయి.     


మూలం : సంస్కృత కథా - ప్రాణాదపి సంస్కృతి: శ్రేష్ఠ 

( సుగంధ: సంస్కృత కథా సంగ్రహ: నుండి )

Saturday, September 15, 2012

ధర్మ దృష్టి


శ్రీ రామచంద్రునికి రావణునకు మధ్య యుద్ధం సంభవించింది. రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. అప్పుడు శ్రీ రాముడు బ్రహ్మాస్త్రాన్ని  ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. అది చూచి విభీషణుడు ఎంతో దు:ఖించాడు. మండోదరి కూడ ఎంతగానో రోదించింది.  

రాముడు విభీషణునితో   " విభీషణా ! విలపించకు ! రావణుడు వీరస్వర్గ మలంకరించాడు. ఇప్పుడు శవదహన సంస్కార సమయం. అందుకు సిద్ధం చెయ్ ! " అని అన్నాడు. 

" రామా ! రావణుడు అధర్మ వర్తనుడు, పరస్త్రీ కాముకుడు, దుష్టుడు, పాపి. అందువలన నేనతనికి శవసంస్కారం చేయను" అని విభీషణుడు పలికాడు. 

" విభీషణా ! " మరణాంతం వైరం ". అంటే మరణం వరకే శత్రుత్వం ఉంటుంది. మరణం తరువాత శత్రుత్వం అనుచితం, ధర్మ విరుద్ధం. ఇప్పుడు రావణుడు మృతి చెంది యున్నాడు. అతని కొడుకు లందరూ కూడ మరణించారు. కుంభకర్ణుడు కూడ మృతి చెందాడు. కనుక రావణుని శవదహన సంస్కారాలు నీవే చేయాలి. " అని శ్రీ రాముడు పలికాడు.    

విభీషణుడు " రామా ! ఐననూ రావణుడు పాపి......."   

రాముడు గంభీర స్వరంతో  " విభీషణా !  " మరణాంతం వైరం" . అందువలన నాకు కూడ ఇప్పుడు రావణుని విషయంలో శత్రుత్వం లేదు. అతడు నీకెలా సోదరుడో, నాకూ అలాగే. ఒకవేళ నీవు  చేయకపోతే అతనికి శవసంస్కారం నేనే పూర్తిచేస్తాను" అని పలికాడు.  

విభీషణుడు శ్రీరామునికి అంజలి ఘటిస్తూ అన్నాడు " క్షమించండి. నేను శవదహనసంస్కారం చేస్తాను. రామా ! నీ ధర్మ దృష్టి అసాధారణం "



ధర్మమూర్తి  శ్రీ రామచంద్రునికి ప్రణామములు. 


సుగంధ: సంస్కృత కథా సంగ్రహ : నుండి 

Tuesday, September 11, 2012

పరహిత చింతనం

ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తం దూరదేశం పోతూ, తన సామానులన్నీ ఒక ఒంటెపై వేసి ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో ఒక ఎడారి వచ్చింది. వైశ్యుని వద్ద ఆహారం స్వల్పంగా వుంది. ఐదురోజులు గడిచాయి. ఆహారం పూర్తిగా ఐపోయింది. వైశ్యుడు దేవుణ్ణి ప్రార్థించాడు, " దేవుడా ! నాకు ఆహారాన్ని ప్రసాదించు !" పదిరోజులు గడచిపోయాయి. వైశ్యునికి ఆహారం లభించలేదు. తనతో తెచ్చుకున్న నీరు కూడ ఐపోయింది. ఎక్కడా నీటి జాడ లేదు. ఎటు చూచినా ఇసుకే. ఎండ మండిపోతోంది. 

వైశ్యుడు దీనంగా " దేవుడా ! నీరు లేదు, అన్నం లేదు. కరుణించి ప్రసాదించు !" అని వేడుకున్నాడు. 
మూడు రోజులు గడిచాయి. వైశ్యుడు ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేక పోతున్నాడు. అతడు దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టాడు. " నీవు భక్తప్రియుడవు గాదు. నీ హృదయం  కఠినం. తాగడానికి నీరు కూడ నీ వివ్వడం లేదు. " 

ఇంకా మూడు రోజులు గడిచాయి. వైశ్యుని కాళ్ళలో చేతుల్లో  శక్తి పూర్తిగా నశించిపోయింది. ఒంటె ఇసుకలో కూలబడి వుంది. దాహంతో అది దీనంగా చుట్టూ పరికిస్తోంది. వైశ్యుని హృదయం కరుణతో నిండిపోయింది. అతడు ఇలా చింతించాడు " నే నింతవరకు నా విషయమే ఆలోచించాను. ఈ ఒంటె నన్ను మోస్తూ నాకు సేవ చేస్తోంది. ఇప్పుడు ఇది మరణావస్థలో వుంది. దేవుడా ! అనుగ్రహించు ! లేకుంటే మా చావు ఖాయం !" 

అంతలోనే దూరంగా నీటి శబ్దం వినిపించింది. వైశ్యుడు కష్టంగా లేచి నిలబడి నీటి శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఒంటెను కూడ తనతో తీసికెళ్ళాడు. దానికి నీరు త్రాగించి, తను కూడ దాహం తీర్చుకున్నాడు. సమీపంలో కనిపించిన పళ్ళని తిన్నాడు. ఒంటెకు కూడ ఆహారాన్ని అందించాడు. 

స్వార్థచింతనా పరుడైన వాడిని దేవుడెప్పుడూ అనుగ్రహించడు. పరహితం అభిలషించే వారిని మాత్రం తప్పక అనుగ్రహిస్తాడు. 


మూలం : పరహిత చింతనం  
 సుగంధ : సంస్కృత కథా సంగ్రహ: నుండి 

Monday, September 10, 2012

 నృపతుంగుని న్యాయపాలన



రాష్ట్రకూట వంశంలో జన్మించిన నృపతుంగుడు చక్రవర్తి, గుణశీలుడు మరియు న్యాయనిష్థ గలవాడు. న్యాయ మార్గంలో రాజు ప్రజలు అందరూ సమానులే అని అతని అభిప్రాయం.  నృపతుంగుని కుమారుడు కృష్ణుడు. అతడు కోపిష్ఠి. తండ్రిని నిందిస్తూ ప్రజలను పీడించే వాడు. ఎప్పుడూ దుర్జన సాంగత్యంలోనే కాలం గడిపేవాడు.     
 
అతడు ప్రౌఢ వయస్కుడవగానే శత్రుపక్షపు రాజు కుమార్తెను వివాహమాడి , వారి ప్రోద్బలంతో తండ్రి రాజ్యంపైనే దండెత్తాడు. నృపతుంగుడు  ధీరుడు, శూరుడు. యుద్ధంలో కృష్ణుడు ఓడిపోయి , బందీగా చిక్కాడు. న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. రాజు న్యాయాధీశుడు, కృష్ణుడు అపరాధి. ' తీర్పు ఎలా ఉంటుందో' అని ప్రజలంతా కుతూహలంతో ఉన్నారు. 'నేను అపరాధినే' అని కృష్ణుడు అంగీకరించి, పశ్చాత్తాప పడ్దాడు.  కృష్ణుడు స్వరాజ్య ద్రోహి  కాబట్టి అతనికి మరణ దండనే యుక్తం అని రాజు  తీర్పు నిచ్చాడు. ప్రజలంతా మౌనంగా వుండిపోయారు. " రాజు కొక్కడే కుమారుడు. అతడు లేకపోతే రాజ్యంలో అరాచకం ప్రబలొచ్చు. కాబట్టి అతడు జీవించి ఉండాలి" అని ప్రజలు కోరుకున్నారు. కుమారుణ్ణి క్షమించమని వారు రాజును ప్రార్థించారు. కాని రాజు అందుకు ఒప్పుకోలేదు.  

చివరికి  ప్రజల ఒత్తిడితో రాజు యువరాజును క్షమించి, " కుమారా! ప్రజలే నీకు ప్రాణభిక్ష పెట్టారు. కాబట్టి ప్రజా సేవయే నీ ప్రథమ కర్తవ్యం"  అని అన్నాడు. అనతి కాలంలోనే కృష్ణుడు ప్రజలను వాత్సల్యంతో పరిపాలిస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.       
 

" సుగంధ : సంస్కృత కథాసంగ్రహ:" నుండి  
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago